Saturday, 29 September 2012

రక్షణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లు చూపించు

డివైజ్ డ్రైవర్లని సక్రమంగా తొలగించకపోతే


ఏదైనా హార్డ్ వే పరికరాన్ని సిస్టమ్ నుండి తొలగించిన తర్వాత దాని డివైజ్ డ్రైవర్లని కూడా తీసేయడం ఉత్తమం. అలాగే మీ డివైజ్ డ్రైవర్లని లేటెస్ట్ వెర్షన్‍తో అప్‍గ్రేడ్ చేసుకునే ముందు పాత డ్రైవర్లని డివైజ్ మేనేజర్ ద్వారా uninstall చేసుకోండి. నిరుపయోగంగా లేదా పాతవి,,కొత్తవి రెండు వెర్షన్లుగా సిస్తమ్‍లో పేరుకుని పోయే డివైజ్ డ్రైవర్లు బూటింగ్ సమయంలో సమస్యాత్మకంగా పరిణమిస్తాయి. ఏయే డివైజ్ డ్రైవర్లు మీ సిస్టమ్‍లో వృధాగా పడి ఉన్నాయో మీరు గుర్తించకపోతే ఇంటర్నెట్‍లో Driver Sweeper పేరిట ఓ సాఫ్ట్ వేర్ లభిస్తుంది. అది డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేయండి. అది సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేసి వృధాగా పడి ఉన్న డివైజ్ డ్రైవర్లని చూపిస్తుంది. వాటిని నిస్సందేహంగా తొలగించవచ్చు.


ఇక అశ్రద్ధ చేయవద్దు



తమ కంఫ్యూటర్ సెక్యూరిటి పట్ల చాలామంది ఉదాసీనత కనబరుస్తుంటారు. ఎప్పటికప్పుడు మనం రెగ్యులర్‍గా వాడే అప్లికేషన్ ప్రోగ్రాములకు సంబంధించి సెక్యూరిటీ ఫిక్స్ లు లభిస్తున్నా అవేమి తమకు అవసరం లేవన్నట్లు నెట్‍లో ఏ సైట్లని బడితే వాటిని స్వేచ్చగా ఓపెన్ చేస్తుంటారు. Mpack పేరిట ఇటీవల రష్యన్ హ్యాకర్లు, ఓ హ్యాకింగ్ ప్యాకేజిని రూపొందించి, అనేక ఆన్‍లైన్ సైట్లని హైజాక్ చేసారు. అలాగే ఈ ప్యాక్‍ని ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈప్యాక్‍ని కొనుగోలు చేసినవారు దీని సహాయంతో వివిధ వెబ్ సైట్లని హైజాక్ చేయడంతో పాటు, Internet Explorer 6, 7, Windows XP SP2, Vista IE7, Windows 2000 SP4 వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టమ్‍లు, అప్లికేషన్ ప్రోగ్రాముల్లోని సెక్యూరిటీ లోపాల ఆధారంగా ఇతర కంప్యూటర్లపై సులభంగా నియంత్రణ పొందగలుగుతున్నారు. ఈ తరహ అటాక్‍ల ప్రమాదాన్ని గుర్తించి మైక్రోసాఫ్ట్ ఎప్పటికప్పుడు సెక్యూరిటీ లోపాలని పూడ్చే విధంగా Fixలను, అప్‍డేట్లని అందిస్తోంది. ఆన్‍లైన్‍లో స్నేహితులుగా మారిన పలువురు కలిసి Mpack రూపకల్పనలో భాగం పంచుకున్నారు. మీరు ఇంతకుముందు చెప్పుకున్న అప్లికేషన్ ప్రోగ్రాములను ఉపయోగించకపోయినా ఒక్క చెత్త సైట్‍ని విజిట్ చేస్తే చాలు Mpack అటాక్ బారిన పడే ప్రమాదం ఉంది. Windows Xp SP2 సిస్టమ్‍లు Secure Sockets Layer and Transport Level Security ఆధారంగా ఎన్‍క్రిప్టెడ్ కనెక్షన్లని కలపడంలో సమస్యాత్మకంగా ఉన్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని హ్యాకర్ మన సిస్టమ్‍లోకి ప్రవేశించగలుగుతున్నారు. ఈ Mpack హ్యాకింగ్ సెట్‍ని మొదట్లో రష్యన్ హ్యాకర్లకు మాత్రమే విక్రయించారు. ఆ తర్వాత వివిధ ఫోరమ్‍లు, న్యూస్ గ్రూపుల నుండి భారీ స్పందన రావడంతో దానిని రూపొందించిన ఒరిజినల్ ప్రోగ్రామర్లు ఆ ప్యాక్‍ని 700-1000 డాలర్లకు విక్రయించడం మొదలుపెట్టారు. అంత ఎక్కువ ధర నిర్ణయించినా దాదాపు అధికశాతం సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని అది రిమోట్ కంప్యూటర్‍పై ఆధిపత్యం సంపాదించగలగడం వల్ల దానిని కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఉత్సుకత చూపిస్తున్నారు. ఓ వెబ్‍సైట్ ఆ Mpack రూపకర్తలలొ ఒకరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇలాంటి పలు విషయాలు వెలుగు చూశాయి. సో… అసలు ఫైర్‍వాల్ అంటే ఏమిటో తెలియకుండా, ఏంటీవైరస్ లేకుండా, Windowsని, అప్లికేషన్ ప్రోగ్రాములనూ అప్‍డేట్ చేసుకోకుండా మనం ఎన్ని చిక్కులు తెచ్చుకుంటున్నామో చూడండి...

Windows XP సర్వీస్ ప్యాక్ 3

SNAG-0000
Windows XP వినియోగదారులు Service Pack 3ని ఈ క్రింది లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోండి. 336 MB పరిమాణం గల ఈ సర్వీస్ ప్యాక్ ని http://download.microsoft.com/download/a/e/4/ae43e777-d69b-4b96-b554-d1a2a0f40fac/windowsxp-kb936929-sp3-x86-enu.exe అనే సైట్ లింకు నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనేక సెక్యూరిటీ లోపాలు ఈ సర్వీస్ ప్యాక్ ద్వారా పరిష్కరించబడ్డాయి. ఇంటర్నెట్లో ఇంతకాలం అనధికారిక SP3ల పేరిట చలామణి అయిన ప్రోగ్రాముల్లో అనేక ప్రమాదకరమైన స్క్రిప్ట్ లు పొందుపరచబడి ఉండి అనేక ఇబ్బందులకు కారణమవుతున్నాయి. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నేరుగా మైక్రోసాఫ్ట్ సైట్ నుండి పై లింకు ద్వారా సర్వీస్ ప్యాక్ 3ని డౌన్ లోడ్ చేసుకోండి. అలాగే ఈ SP3కి సంబంధించిన అదనపు వివరాల కోసం PDF డాక్యుమెంటేషన్ (కొత్తగా ఇందులో ఏమేమి పొందుపరిచారు అన్న సమాచారం ఉన్నది) కోసం http://www.microsoft.com/downloads/details.aspx?FamilyID=68c48dad-bc34-40be-8d85-6bb4f56f5110&displaylang=en అనే సైట్ ని సందర్శించండి.

ప్రింటర్ రక్షణ…


ప్రింటర్‍ని బాగా గాలి వెలుతురు తగిలే ప్రదేశంలో అమర్చుకోవాలి. మరీ తేమగానూ, బాగా వేడిగానూ ఉన్న ప్రదేశాల్లో ఉంచవద్దు. ప్రింటర్ పై భాగాన్ని కొద్దిగా నీటిలో ముంచిన గుడ్డతో క్లీన్ చెయ్యవచ్చు. కానీ, టోనర్ కాట్రిడ్జ్, రోలర్లు వంటి అంతర్గత భాగాలను క్లీన్ చేసేటప్పుడు మాత్రం పొడిగా పీచులు లేని గుడ్డతోనే క్లీన్ చెయ్యాలి. టోనర్ కాట్రిడ్జ్ లో ఇంక్ నిండుకుంటున్నప్పుడు…ప్రింటింగ్ సక్రమంగా జరగదు. అలాంటప్పుడు కాట్రిడ్జ్ ని బయటకు తీసి కాట్రిడ్జ్ లోపల గోడలకు అంటుకున్న పౌడర్ వినియోగంలోకి తీసుకురాబడేలా మెల్లగా షేక్ చేస్తే మరికొన్ని ప్రింటౌట్లను పొందవచ్చు. టోనర్‍ని షేక్ చేసేటప్పుడు లెఫ్ట్, రైట్ కాకుండా.. పైకీ క్రిందికీ షేక్ చెయ్యాలి. ఎప్పటికప్పుడు మీ ప్రింటర్ మేన్యుఫేక్చరర్ వెబ్‍సైట్‍కి వెళ్ళి మీ ప్రింటర్ మోడల్‍కి సంబంధించిన తాజా డ్రైవర్లని డౌన్‍లోడ్ చేసుకోవడం మంచిది. లేటెస్ట్ డ్రైవర్ల మూలంగా ప్రింటింగ్ స్పీడ్ పెరగడమే కాకుండా, సరికొత్త ఫాంట్స్ లభిస్తాయి. అలాగే ఇన్ కంపాటబిలిటీలేమైనా ఉంటే తొలగిపోతాయి.

హార్డ్ డిస్క్ స్పేస్ ఎంతో కీలకమైనది….


హార్డ్ డిస్క్ ఎంత వేగంగా పనిచేస్తే కంప్యూటర్ పెర్‍ఫార్మెన్స్ అంత మెరుగ్గా ఉంటుంది. హార్డ్ డిస్క్ స్పీడ్ పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనది హార్డ్ డిస్క్ లోఉండే Platters యొక్క రోటేషనల్ స్పీడ్. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే హార్డ్ డిస్క్ నుండి సమాచారం అంత స్పీడుగా రీడ్/రైట్ చెయ్యబడుతుంది. నిముషానికి 7,200చుట్లు (దీన్నే rpm గా చెబుతుంటారు.) తిరిగే హర్డ్ డిస్క్ మెరుగైన పెర్‍ఫార్మెన్స్ అందిస్తుంది. అలాగే హర్డ్ డిస్క్ పనితీరుపై Seek Time కూడా విశేష ప్రభావం చూపిస్తుంది. మనం ఒక ఫైల్ ఏ లొకేషన్‍లో ఉందో వెదకడానికి పట్టే సమయాన్ని SeekTime అంటారు. అదే విధంగా హర్డ్ డిస్క్ లోని ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి సమాచారం తరలించబడడానికి పట్టే సమయం లేదా డిస్క్ నుండి ఫ్లాపీ, సిడి, జిప్ డ్రైవ్‍ల వంటి రిమూవబుల్ మీడియాలకు సమాచారాన్ని ట్రాన్స్ ఫర్ చెయ్యడానికి పట్టే సమయం Disk Transfer Rateగా వ్యవహరించబడుతుంది. ఈ ట్రాన్స్ ఫర్ రేట్ కూడా హర్డ్ డ్జిస్క్ పెర్‍ఫార్మెన్స్ పైనా, అదే సమయంలో పిసి పనితీరుపైనా విశేషమైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్ని గరిష్ట స్థాయిలో ఉంటేనే సిస్టమ్ వేగంగా పనిచేస్తుంది. లేదంటే p4 సిస్టమ్ అయినా ఆశించినంత వేగంగా ఉండదు.

Opera 9.1 కి దన్నుగా ఫ్రాడ్ ప్రొటెక్షన్




Mozilla Firefox వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. కాని దానికి పూర్వం IE తర్వాత Opera బ్రౌజరే బాగా వాడుకలో ఉండేది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌పై ఫిషింగ్ స్కామ్‌లు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో IEతో పాటు అన్ని బ్రౌజర్లలోనూ యాంటీ ఫిషింగ్ ఫిల్టర్లు అమర్చబడుతున్నాయి. ఆయా బ్రౌజర్ల ద్వారా మనం ఏదైనా వెబ్‌సైట్‌లోని లింకుని క్లిక్ చేసిన వెంటనే ఆ లింక్ సరైన వెబ్‌సైట్‌దో కాదో సెక్యూరిటీ సర్టిఫికెట్లని పరిశీలించడం ద్వారా నిర్ధారించి బ్రౌజర్లు మనల్ని అలర్ట్ చేస్తాయి. దీనివల్ల ఆన్‌లైన్ బ్యాంకింగ్, షాపింగ్, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు వంటివి జరిపేటప్పుడు దొంగల పాలిట పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇదే కోవలో ప్రస్తుతం Opera 9.1 వెర్షన్ వాడుతున్న యూజర్లకి సైతం 'ఫ్రాడ్ ప్రొటెక్షన్ ' అనే సరికొత్త సదుపాయం అందించబడుతోంది. అయితే డీఫాల్ట్‌గా ఈ ఫీచర్ డిసేబుల్ చేయబడి ఉంటోంది. దీనిని మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్రౌజర్ ద్వారా మనం ఏ వెబ్‌సైట్ లింక్‌ని క్లిక్ చేసినా... బ్రౌజర్ ఆ లింక్‌ని Geotrust, Phishtank సర్వర్లచే క్రోడీకరించబడిన ఫిషింగ్ సైట్ల వివరాలతో సరిపోల్చి సరైన లింక్ అయితేనే ఓపెన్ చేస్తుంది.

ట్రోజాన్‍లతో చాలా జాగ్రత్త...




ఒకప్పుడు వైరస్‌ల పేరు వింటే హడలిపోయేవారు. ఇప్పుడు Trojan Horses అందరిని అదరగొడుతున్నాయి. మనకు ఎదో మేలు చేస్తుందన్న భావనను కల్పించి మనకు మనం స్వయంగా డౌన్‌లోడ్ చేసుకునేటట్లు ప్రేరేపించి తీరా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మన కంప్యూటర్‌పై పూర్తి నియంత్రణను దానిని పంపించిన యూజర్‌కి అందించేదే TrojanHorse. మంచి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పరిజ్ఞానం ఉన్న ప్రోగ్రామర్లు మాత్రమే ఇలాంటి వాటిని రూపొందించగలుగుతారన్న తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంది. ట్రోజాన్లని రూపొందించడానికి ప్రస్తుతం అనేక మార్గాలు అందుబాటులోకి రావడం వల్ల ఎవరుబడితే వారు వాటిని రూపొందించి ఇతరుల సిస్టమ్‌లలోకి పంపించగలుగుతున్నారు.


సహజంగా కొన్ని ప్రత్యేకమైన ట్రోజాన్ తయారీ సాఫ్ట్‌వేర్లని ఉపయోగించి Server.exe పేరిట ఓ ఫైల్‌ని క్రియేట్ చేస్తారు. సహజంగా ఇది 90, 120KBల వంటి చాలా తక్కువ సైజ్‌లో ఉంటుంది. దీనిని ఏదైనా అశ్లీల ఫోటోకి Binder పేరిట లభించే ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్ సాయంతో జతచేస్తారు. ఇక యాహూ చాట్‌రూమ్‌లు వంటి వాటిలోకి ఆడవారి మెయిల్ ఐడిలతో లాగిన్ అయి తమకు PMలు పంపించే మగవారిని మెల్లగా మాటల్లో పెట్టేసి "నా ఫోటో చూస్తారా" అంటూ ఆరా తీసి అవతలి వ్యక్తి ఆసక్తి చూపించగానే ఇంతకుముందు అశ్లీలచిత్రంలో దాచిపెట్టిన ట్రోజాన్ ప్రోగ్రామ్‌ని అవతలి వ్యక్తికి పంపిస్తారు. అవతలి వ్యక్తి దానిని ఓపెన్ చేయగానే ఫోటో కనిపిస్తుంది కాని బ్యాక్‌గ్రౌండ్‌లో తన సిస్టమ్‌లోకి ట్రోజాన్ ప్రవేశించిందన్న విషయం అతనికి తెలియదు. ఇక అంతే. అప్పటినుండి ఆ వ్యక్తి యొక్క IP అడ్రస్ ట్రోజాన్ పంపించిన వ్యక్తికి చేరవేయబడుతుంటుంది. ఆ అడ్రస్ ఆధారంగా అవతలి వ్యక్తి యొక్క కంప్యూటర్‌ని కంట్రోల్ చేస్తుంటారు.

వైరస్‍‍లను ఇలా తయారుచేస్తారు...

కంప్యూటర్ వైరస్‌లను తయారు చేయాలంటే బాగా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలన్న అభిప్రాయం మనలో చాలామందికి ఉంది. వాస్తవానికి అది నిజమే! అయితే ఇటీవలి కాలంలో రెడీమేడ్‌గా ఎవరైన క్షణాల్లో తమకు తాము వైరస్‌లను క్రియేట్ చేసుకోగలిగేలా Virus Builder ప్రోగ్రాములు వ్యాప్తిలోకి వచ్చాయి. ఇలాంటి ప్రోగ్రాముల్లో హార్డ్ డిస్కులోని ఫైళ్ళని డిలీట్ చేసేలా, Control Panel, Task Manager, Mouse, Desktop వంటి వేర్వేరు అంశాలను డిసేబుల్ చేసేలా ఆప్షన్లు పొందుపరచబడి ఉంటాయి. ఇక్కడ మీరు ఏయే అంశాలను టిక్ చేసి, Create Virus అనే బటన్‌ని క్లిక్ చేస్తే వెంటనే ఓ EXE ఫైల్ సిద్ధమైపోతుంది. ఇప్పుడు ఆ వైరస్ ప్రోగ్రామ్‌ని రన్ చేసిన సిస్టంలో ఇంతకుముందు టిక్ చేసిన అంశాలు ఆచరించబడతాయి. ఇలా ఎవరైనా సులభంగా వైరస్‌లు తీర్చిదిద్దగలుగుతున్న ప్రస్తుత తరుణంలో మనం మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం కదా!

నార్టన్ ఏంటీ వైరస్ తాజా డెఫినిషన్లు ఇవిగోండి

మీ వద్ద నార్టన్ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ ఉండీ, ఏ కారణం చేతైనా ఆన్ లైన్ ద్వారా అది అప్ డేట్ అవకపోతున్నట్లయితే నిన్ననే (నవంబర్ 22) విడుదల చేయబడిన తాజా నార్టన్ వైరస్ డెఫినిషన్లని ఈ క్రింది వెబ్ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోండి.
http://definitions.symantec.com/defs/20071122-022-i32.exe


స్కానర్ తో స్కాన్ చేయడానికి ముందు సేవ్ చేసుకోండి...


మన వద్ద స్కానర్ ఉన్నట్లయితే ఫొటోలను స్కాన్ చేయడానికి దానితో పాటు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ అందించబడుతుంది. అయితే ప్రతీసారీ ఇలా స్కానర్ తో పాటు అందించబడిన సాఫ్ట్ వేర్ కి వెళ్లవలసిన అవసరం లేకుండా స్కానర్ driversని ఇన్ స్టాల్ చేసిన వెంటనే TWAIN పేరిట వర్డ్, ఫొటోషాప్, పేజ్ మేకర్ వంటి అన్ని ఇమేజ్ ఎడిటింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, వ్యూయింగ్ అప్లికేషన్లలోనూ ఆప్షన్ లభిస్తుంది. ఈ ఆప్షన్ ని ఉపయోగించి నేరుగా స్కానర్లోని ఇమేజ్ లను స్కాన్ చేసి ఆయా అప్లికేషన్లలో వాడుకోవచ్చు. అయితే ఇలా నేరుగా స్కాన్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఉదా.కు.. మీరు ఫొటోషాప్ నుండి నేరుగా File మెనూలోని Acquire లేదా Import అనే ఆప్షన్ ని ఉపయోగించి స్కానర్లోని ఇమేజ్ ని స్కాన్ చేసేటప్పుడు ఒక్కోసారి స్కానర్ డ్రైవర్లు సరిగ్గా ఇనీషయలైజ్ అవక ఏకంగా ఫొటోషాప్ అప్లికేషన్ ఉన్న ఫళంగా క్రాష్ అయ్యే ప్రమాదం ఉంది. దీనివల్ల ఫొటోషాప్ లో ఆ సమయంలో ఇంకేమైనా డాక్యుమెంట్లు సేవ్ చేయబడకుండా ఉన్నట్లయితే డేటా నష్టపోవడం జరుగుతుంది. అందుకే థర్ట్ పార్టీ సాఫ్ట్ వేర్లలో నేరుగా స్కానర్ TWAIN డ్రైవర్లని వాడదలుచుకుంటే ముందు ఆ థర్ట్ పార్టీ సాఫ్ట్ వేర్లో ఓపెన్ చేయబడి ఉన్న ఫైళ్లని సేవ్ చేసిన తర్వాతే స్కానింగ్ కి ఉపక్రమించండి.


ఉచిత, పెయిడ్ ఏంటీ వైరస్ సాఫ్ట్ వేర్లకు మధ్య వ్యత్యాసం


Norton, McAfee, Panda వంటి పలు ఏంటీవైరస్ ఉత్పత్తులు మార్కెట్లో కొంత ధరకు విక్రయించబడుతుండగా AVG, Avast, Avira వంటి కొన్ని ఏంటీవైరస్ ఉత్పత్తులు ఉచితంగా అందించబడుతున్నాయి. "ఉచితమైనవీ, డబ్బు చెల్లించి కొనుక్కునేవీ రెండూ ఏంటీవైరస్ లే కదా.. ఏదైతే ఏముంది.." అని తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. సాధారణంగా పెయిడ్ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లలో వైరస్ లను గుర్తించే డెఫినిషన్లతో పాటు కీలాగర్లు, బ్రౌజర్ హైజాకర్లు, డయలర్ ప్రోగ్రాములు, PUPలు వంటి వాటిని గుర్తించే స్కానింగ్ టెక్నాలజీ కూడా పొందుపరచబడి ఉంటుంది. కొన్ని పెయిడ్ ఏంటీ వైరస్ లలో ఇ-మెయిల్ వైరస్ స్కానింగ్, క్రెడిట్ కార్డ్ వివరాలు వంటి వాటిని కాపాడే ప్రైవసీ సదుపాయాలు సైతం పొందుపరచబడి ఉంటాయి. అదే ఉచిత ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ల విషయానికి వస్తే కేవలం వైరస్ లను గుర్తించే టెక్నాలజీ మాత్రమే వాటిలో ఉంటుంది. ఇ-మెయిల్ వైరస్ స్కానింగ్ వంటి అదనపు సదుపాయాలను పొందాలంటే ఆయా ఫ్రీ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్లు అందించే "ప్రీమియమ్ లేదా ప్రొఫెషనల్" వెర్షన్లని కొనుగోలు చేయవలసిందే. పెయిడ్ ఏంటీ వైరస్ కొనాలనుకుంటున్నప్పుడు అది అందించే సదుపాయాలు మన అవసరాలకు సరిపోతాయో లేదో చూడండి.

బ్యాంక్ లావాదేవీలు జర జాగ్రత్త



ఇంటర్నెట్ సదుపాయం అన్ని ప్రాంతాల్లోకి విస్తరించిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ళు, నిధుల బదిలీలు వంటి పనుల్ని ఎవరికి వారు తమ పిసి ముందు కూర్చుని చేసుకోగలుగుతున్నారు. అయితే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు తస్కరించే ఫిషింగ్ స్కామ్‌లు, కీలాగర్లు వంటి అనేక ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీరు లావాదేవి జరిపినా లేకున్నా తరచూ మీ బ్యాంక్ ఎకౌంట్‌ని తనిఖీ చేసుకుంటూ ఏవైనా తప్పుడు ఎంట్రీలు కనిపించినట్లయితే ఆలస్యం చెయ్యకుండా మీ బ్యాంక్‌బ్రాంచ్‌కి ఫిర్యాదు చేయండి. క్రెడిట్‌కార్డ్ ఉన్నట్లయితే వాటీని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే సదుపాయం ఉంటే వాటిపైనా ఓ కన్నేసి ఉంచండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లు లాగిన్ అయిన తర్వాత https:// అనే ప్రోటొకాల్ (వెబ్‌సైట్ అడ్రస్ ఇలా ప్రారంభమవుతుంది) కలిగిన వెబ్‌పేజీ ఓపెన్ అయితేనే మీరు నిజమైన బ్యాంకింగ్ సైట్‌కే కనెక్ట్ అయినట్టు లెక్క. ఇంటర్నెట్ ద్వారా ఒక ఖాతా నుండీ మరొక ఖాతాకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తునట్లయితే లావాదెవీకి ముందు తర్వాత బ్యాలెన్స్ వివరాలను తనిఖీ చేసుకోండి. మీవద్ద ప్రింటర్ ఉంటే స్టేట్‌మెంట్‌లను తరచూ ప్రింట్ చేసి పెట్టుకోవడం ఉత్తమం.

సెల్‌ఫోన్, ప్రీపెయిడ్‌లని కొనడం, రైల్వే టికెట్లు, కరెంట్ బిల్లులు, మున్సిపాలిటీ అస్తి పన్నులు వంటివి ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లించడానికి వీలు కలుగుతుంది. ఈ నేపధ్యంలో బిల్లులు చెల్లించడానికి ముందు మీ ఎకౌంట్‌లో ఎంత నగదు నిల్వ ఉందో చూసుకుని బిల్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఎంత మొత్తం కట్ అయిందో బేరీజు వేసుకోండి. ఆ చెల్లింపులకు చెందిన లావాదేవీలు ప్రింట్ తీసిపెట్టుకోవడం మరువకండి. .తర్వాత ఏవైనా తేడాలు వస్తే ఆ ప్రింటౌటే మీకు రక్షణగా నిలుస్తుంది. క్రెడిట్‌కార్డ్ ఉంది కదా అని ఏ వెబ్‌సైట్‌కి పడితే ఆ వెబ్‌సైట్‌కి Premium Membership కోసం చెల్లింపులు జరపకండి. ఖచ్చితంగా నమ్మదగిన వెబ్‌సైట్లకి మాత్రమే చెల్లింపులు జరపండి. ఆన్‌లైన్ షాపింగ్ ప్రస్తుతం క్రేజ్ అయిపోయింది. కానీ, మీకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని నేరుగా వెళ్ళి మన్నిక చూసుకుని కొనడమే మంచిది. మన దేశంలో దొరకని తప్పనిసరి వస్తువులను నెట్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం తప్పదనుకోండి.

Guest ఎకౌంట్‌ని పాస్‌వర్డ్ ప్రొటెక్ట్ చేయడం



Windows XP ఆపరేటింగ్ సిస్టమ్ Guest account ద్వారా లాగిన్ అయ్యేవారు సైతం తప్పనిసరిగా పాస్‍వర్డ్ ఎంటర్ చేస్తేనే సిస్టమ్‍లోకి ప్రవేశించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. Guest Accountకి పాస్‍వర్డ్ సెట్ చెయ్యడానికి Start>ControlPanel>AdministrativeTools>ComputerManagement అనే విభాగంలోనికి వెళ్ళి Local Users and Groups అనే ఆప్శన్ క్రింద Users ఫోల్డర్‍ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోల్డర్‍లో Guest Accountపై మౌస్‍తో రైట్‍క్లిక్ చేసి Set Password అనే ఆప్షన్‍ని ఎంచుకోవాలి. వెంటనే ఓ వార్నింగ్ మెసేజ్ స్క్రీన్‍పై ప్రదర్శింపబడుతుంది. దానిలోనే Proceed బటన్ పొందుపరచబడి ఉంటుంది ఆ బటన్ క్లిక్ చేసిన వెంటనే పాస్‌వర్డ్‌ని Guest Account కి సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా సాధ్యమైనంత వరకూXP యూజర్లు వీలైనన్ని తక్కువ యూజర్ ఎకౌంట్లు ఉండేలా చూసుకోండి. మనం క్రియేట్ చేసే ప్రతీ యూజర్ ఎకౌంట్ హార్డ్‌డిస్క్‌పై కొంత స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. స్థలం వృధా చేసుకోకండి.

వేరే వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేయవద్దు.




విండోస్ ఆపరేటింగ్ సిస్టంతో పాటు Internet Explorer ప్రోగ్రామ్ కూడా ఇన్‌స్టాల్ చేయ్యబడుతుంది. విండోస్ 98 తో పాటు IE వెర్షన్ 5, మిలీనియంతోపాటు 5.5, ఎక్స్‌పీ తోపాటు వెర్షన్ 6 ఇన్‌స్టాల్ చెయ్యబడుతాయి.ఇతర సాఫ్ట్‌వేర్ల మాదిరిగానే బ్రౌజర్‍ని కూడా అప్‌గ్రేడ్ చెయ్యడం వల్ల పెర్‌ఫార్మెన్స్ బాగుంటుందన్న ఉద్దేశంతో కొంతమంది ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ని అప్‌గ్రేడ్ చేస్తుంటారు. దీనికి తోడు కొన్ని పత్రికలు ఉచితంగా అందించే సిడిల్లో IE తాజా వెర్షన్ అందిస్తుంటారు. అప్‌గ్రేడ్ చేయడం మంచిది కాకపోతే వాళ్ళెందుకు ఆ ప్రోగ్రామ్ సెపరేట్‌గా ఇస్తారు అన్న అభిప్రాయంతో వెనుకాముందు ఆలోచించకుండా బ్రౌజర్‌ని అప్‌గ్రేడ్ చేస్తుంటారు. ఏ బ్రౌజర్‌నైనా అప్‌గ్రేడ్ చేయడానికి ముందు పాత దాన్ని uninstall చేసుకుంటేనే ఆ బ్రౌజర్‌తోపాటు లింక్ అయి ఉన్న ఇతర ప్లగ్ఇన్‌లు సైతం తొలగిపోతాయి. కొత వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ అవుతాయి. అయితే Opera వంటి ఇతర బ్రౌజర్ల మాదిరిగా IEని Uninstall చేయడనికి వీలుపడదు కదా! సో... గుడ్డిగా కొత్త వెర్షన్ దొరికింది కదా అని అప్‌గ్రేడ్ చేస్తే సమస్యలు తప్పవు.

ఈ బోర్డ్ లపై టివి ట్యూనర్ వాడుతున్నారా!!




మీ సిస్టమ్‌లో VIA చిప్‌సెట్‌కి చెందిన మదర్‌బోర్డ్ అమర్చబడి ఉండీ, ఆన్‌బోర్డ్ Savage3D వీడియో చిప్ ఉన్నట్లయితే, ఏ కంపెనీకి చెందిన టివి ట్యూనర్ కార్డ్ అమర్చినా Overlay మోడ్‌కి సంబంధించి సమస్యలు తలెత్తుతాయి. Savage 3D వీడియో చిప్ Direct3D ని సపోర్ట్ చెయ్యకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ నేపధ్యంలో ఇంటర్నెట్‌లో VIA సంస్థ వెబ్‌సైట్‌కి వెళ్ళి లేటేస్ట్ Savage 3D డిస్‌ప్లే డ్రైవర్లని డౌన్‌లోడ్ చేసుకుని వాటిని సిస్టమ్‌లో అప్‌డేట్ చెయ్యడం వల్ల పరిష్కారం పొందవచ్చు. అలాగే, Realtek ALC-650 ఆన్‌బోర్డ్ చిప్‌లు కలిగి ఉన్న సిస్టమ్‌ల నుండి టివి ట్యూనర్ కార్డ్ ద్వారా ప్రోగ్రాములను కేప్చర్ చేసేటప్పుడు సౌండ్ కేప్చరింగ్‌కి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. Realtek వెబ్‌సైట్ నుండి లేటెస్ట్ డ్రైవర్లను, ప్యాచ్‌ని మీరు ఏ టివి ట్యూనర్‌కార్డ్ వాడుతున్నా తప్పనిసరిగా బయటి నుండి వచ్చిన కేబుల్ పిన్‌కి సర్జ్‌ప్రొటెక్టర్‌ని కనెక్ట్ చేయండి, లేదంటే కేబుల్ పిన్ ద్వారా సిస్టమ్‌లోకి చేరుకునే surges సిస్టమ్‌లోని ముఖ్యమైన భాగాలను దెబ్బతీసే అవకాశముంది.

కీలాగర్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి? (వీడియోసహిత వివరణ)

రిమోట్ కీలాగర్ ప్రోగ్రాములు గనుక మన సిస్టంలోకి ప్రవేశించినట్లయితే కీబోర్డ్ నుండి మనం ప్రెస్ చేసే ప్రతీ కీనీ, వివిధ విండోలలో ఎంటర్ చేసే యూజర్ నేం, పాస్ వర్డ్ లు వంటి వివరాలు, ఛాటింగ్ లో మనం మాట్లాడే మాటలను ఎవరైతే మన కంప్యూటర్లోకి ఆ కీలాగర్ ని పంపిస్తారో వారికి చేరవేస్తుంటాయి. ఈ నేపధ్యంలో మీ సిస్టంలో ఏదైనా కీలాగర్ ఇన్ స్టాల్ అయి ఉందని సందేహం వచ్చినట్లయితే ఏంటీవైరస్, స్ఫైవేర్ రిమూవల్ ప్రోగ్రాములతో సిస్టం ని స్కాన్ చేసి చూడండి. అలాగే Yahoo Messenger, GTalk, ఆన్ లైన్ ఫోరంలు వంటి వాటిలో యూజర్ నేం, పాస్ వర్డ్ లను ప్రతీసారీ టైప్ చేయడం కాకుండా విండోస్ పాస్ వర్డ్ మేనేజర్ ద్వారా సేవ్ చేసుకుని అవసరం అయినప్పుడు Auto Complete చేయడం ద్వారా టైప్ చేయాల్సిన పని ఉండదు. లేదా AI RoboForm వంటి పాస్ వర్డ్ లను గుర్తుంచుకునే సాప్ట్ వేర్లను వాడండి. తద్వారా కీలాగర్ మనం కీబోర్డ్ నుండి నేరుగా ఏ సమాచారాన్నీ టైప్ చేయం కాబట్టి మన లాగిన్ సమాచారాన్ని పొందలేదు. అసలు కీలాగర్లు ఎలా పూర్తి సమాచారాన్ని సేకరిస్తాయో నేను పరిశోధనాత్మకంగా ఇతరుల కంప్యూటర్లలోకి కీలాగర్ ని పంపించి రికార్డ్ చేసిన సమాచారాన్ని మీకు అవగాహన కోసం క్రింది వీడియోలో పొందుపరిచాను, చూడండి.

RPC (రిమోట్ ప్రొసీజర్ కాల్) దాడులు

RPC అనేది ఒక ప్రొటోకాల్. విండోస్ ఆపరేటింగ్ సిస్టం అప్లికేషన్లు ఇతర కంప్యూటర్లతో కమ్యూనికేట్ చేయడానికి, నెట్ వర్క్ల్ లో పనిచేస్తున్న ఏ కంప్యూటర్ పై అయినా అడ్మినిస్ర్టేర్లు ఇతర ప్రదేశాల నుండి రిమోట్ గా ప్రోగ్రామింగ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ ప్రొటోకాల్ ఉపయోగించబడుతుంది. అయితే మంచి పనులకు ఉద్దేశించబడిన ఈ ప్రొటోకాల్ ని హ్యాకర్లు తమ స్వలాభానికి ఇంటర్నెట్ ద్వారా ఇతర కంప్యూటర్లపై నియంత్రణ సాధించడానికి వాడుకుంటారు. రెండేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన Blaster Word ఈ RPC ప్రొటోకాల్ అధారంగానే కంప్యూటర్లో ప్రవేశిస్తుంది. అకస్మాత్తుగా ఈ క్రింది చిత్రంలో విధంగా స్ర్ద్కీన్ పై మెసేజ్ చూపించబడి 60 సెకండ్లలో కంప్యూటర్ రీస్టార్ట్ కావడం దీని స్వభావం. Windows XP SP2లో దీనికి ప్యాచ్ ని పొందుపరిచారు. అయితే ఇలాంటి RPC exploits ఎన్నో ఇంకా ఉన్నాయి.

LCD మోనిటర్‍ని క్లీన్ చేసే మార్గం



LCD మోనిటర్‍పై దుమ్ము, వేలిముద్రలు పడినప్పుడు సున్నితంగా ఉండే
గుడ్డను తీసుకోండి. మామూలు నీళ్ళలో ఉండే లవణపు పరిమాణం వల్ల
స్క్రీన్‍పై మరకలు పడతాయి కాబట్టి డిస్టిల్ వాటర్ తీసుకొని ఆ నీళ్ళలో
కొద్దిగా వెనిగర్‍ని కలిపి పల్చని మిశ్రమంగా చేయండి.ఇప్పుడు మోనిటర్‍ని
ఆఫ్ చేయండి. లేదా black బ్యాక్‍గ్రౌండ్ సెట్ చేయడం ద్వారా
మోనిటర్‍పై ఉన్న దుమ్ము స్పష్టంగా కన్పిస్తుంది. ఎక్కడైతే దుమ్ముందో
అక్కడ ఆ మిశ్రమంలో పల్చని గుడ్డని తడిపి సున్నితంగా ఒకే దిశలొ
(పైకి క్రిందకి) తుడవండి.మందపాటి గుడ్డని వాడితే LCD మోనిటర్
స్క్రీన్‍పై గీతలు పడతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

Windows Vista క్రాక్‍తో డేంజర్ సుమా!




మైక్రో‍సాఫ్ట్ సంస్థ విడుదల చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Windows Vista యొక్క బీటా వెర్షన్‍ని గతంలో పలువురు యూజర్లు నెట్ నుండి డౌన్‍లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ వెర్షన్‍కి ఉన్న ప్రజాదరణని దృష్టిలో ఉంచుకుని కొందరు హ్యాకర్లు Vista Beta వెర్షన్‍ని జీవితకాలం ఉపయోగించుకోవచ్చంటూ ఇంటర్నెట్‍పై కొని వెబ్‍సైట్లలో ఏక్టివేషన్ క్రాక్‍ని పొందుపరిచారు. Windows Vista All Versions Activation 21.11.06 పేరిట నెట్‍పై దర్శనమిస్తున్న ఈ క్రాక్ ప్రోగ్రాంని మీ కంఫ్యూటర్‍లోకి డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు.. ఇది Crack కాదు. మన సిస్టమ్‍లోని కీలకమైన సమాచారాన్నిహ్యాకర్‍కి పంపిస్తుండే Trojan ప్రోగ్రామ్. ఇలాంటి వాటి మాయలో పడి మీ సిస్టమ్‍ని ఖరాబు చేసుకోకండి. Trojan.PSW Win32.LdPinch.aze అనే ట్రోజాన్ ప్రోగ్రామ్ ఇది. లేటెస్ట్ ఏంటి వైరస్ సాఫ్ట్ వేర్లన్నీ దీనిని గుర్తించగలుగుతున్నాయి. అయితే Norton Antivirus సాఫ్ట్ వేర్ ఈ ట్రోజాన్‍ని గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరం. చాలామంది కంఫ్యూటర్లలో ఎక్కువగా ఈ ప్రోగ్రామే ఉండడంవల్ల సైలెంట్‍గా సిస్టమ్‍లోకి వచ్చేస్తోంది.

మంగళవారం 11 సెప్టెంబర్ 2007

మీ పిసి జాగ్రత్త




అధికశాతం కంప్యూటర్ యూజర్లు క్రమం తప్పకుండా హార్డ్ డిస్క్ ని Scan , Defragmentation చేస్తూ RegCleaner, System Mechanic వంటి యుటిలిటి ప్రోగ్రాముల సాయంతో ఎప్పటికప్పుడు రిజిస్ట్రీని క్లీన్ చేసుకుంటూ తమ కంప్యూటర్ సరైన కండిషన్‍లో ఉందని మురిసిపోతుంటారు. కంప్యూటర్ వేగంగా పనిచెయ్యడానికి ఈ చర్యలన్నీ ఎంతో అవసరమైనవే. అయితే, వీటికి తోడు కొన్ని బహిర్గత అంశాల్ని సైతం పాటిస్తేనే ఎటువంటి అవాంతరాలూ లేకుండా మీ సిస్టమ్ సరిగ్గా పనిచెయ్యగలుగుతుంది. అవేంటో వివరంగా చూద్దాం…


రూమ్ టెంపరేచర్, పిసి అరేంజ్‍మెంట్


సూర్యకిరణాలు నేరుగా ప్రసరించే ప్రదేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కంప్యూటర్‍ని అమర్చకండి. అంతేకాదు. ఉష్ణోగ్రతలో ఎక్కువ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాలూ కంప్యూటర్లకు అనుకూలమైనవి కావు. కాబట్టి, ఏ.సి, కూలర్, హీటర్ వంటి ఉష్ణోగ్రతల్ని మరీ ఎక్కువగా, మరీ తక్కువగా మార్పిడి చేసే పరికరాలకు సమీపంలో కంప్యూటర్లని అమర్చకూడదు. 60-85 డిగ్రీల ఫారెన్‍హీట్ గది ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో పిసిని అమర్చడం ఉత్తమం. మీ కంప్యూటర్ లోపల అమర్చబడి ఉన్న ఫాన్ మంచి కండీషన్లో ఉన్నదైతే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ఫర్వాలేదు. ప్రొసెసర్‍ని చల్లబరిచే ఫ్యాన్‍కు తోడు అదనంగా మరో చిన్న ఫ్యాన్‍ని క్యాబెనెట్ లోపల power LEDలు అమర్చబడిఉండే ప్రదేశం వద్ద అమర్చుకుంటే, మదర్‍బోర్డ్ పై ఉండే ఇతర పరికరాలు కూడా ఎప్పటికప్పుడు చల్ల బరచబడతాయి. వీలైతే క్యాబెనెట్ వెనుకభాగంలో మదర్ బోర్డ్ పై వెలువడే వేడిమిని బయటకు పంపించే exhaust fan అమర్చుకుంటే మరీ మంచిది. చాలా తక్కువ ఖర్చుకే ఇవి దొరుకుతాయి. అయితే క్యాబినెట్‍లో ఏర్పాటు ఉండాలి.


దుమ్ము విషయంలో అస్సలు నిర్లక్ష్యం వద్దు…


ఒక్కసారి క్యాబెనెట్ కవర్‍ని విప్పదీసి చూస్తే లోపల ఎంత దుమ్ము పెరుకుపోయి ఉంటుందో మీకు తెలుస్తుంది. చాలామంది కంప్యూటర్ క్యాబినెట్ కవర్‍ని విప్పడానికే భయపడతారు. దీనివలన ఎంత నష్టం వాటిల్లుతుందో గ్రహించరు. మదర్‍బోర్డ్ పై అమర్చబడిన వివిధ Card ల పైనా, RAM మాడ్యూళ్ళ పైనా, సిపియు ఫ్యాన్, కంప్యూటర్‍లోని భాగాలకు, విద్యుత్ సరఫరా చెసే SMPS లోని ఫ్యాన్ (ఇది క్యాబినెట్ వెనుకభాగంలో back panel నుండి బయటకే కన్పిస్తుంటుంది.
వివిధ కేబుళ్ళపై దుమ్ము అధికంగా పేరుకుపోతుంటుంది. ఎప్పటికప్పుడు ఈ దుమ్ముని తొలగించకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి. ముఖ్యంగా Cardల అంచుల వద్ద ఉండే కాంటాక్ట్ పాయింట్స్ దెబ్బ తిని ఒక్కోసారి ఉన్న పళాన కంప్యూటర్ ఆగిపోవచ్చు. డిస్‍ప్లే నిలిచిపోవచ్చు. స్పీకర్ల నుండి సౌండ్ రాకపోవచ్చు. అలాగే సిపియు ఫ్యాన్ పనితీరు మందగించి, సిస్టమ్ త్వరగా వేడెక్కి మరిన్ని సమస్యలకు కారణం అవుతుంది. ఇక్కడ మరో విషయం తెలుసుకోవాలి. చాలామంది మదర్ బోర్డ్ పై ఉండే IDE , పవర్ కేబుళ్ళని ఇష్టానుసారం వదిలేస్తుంటారు. అవి CPU ఫ్యాన్‍కు అడ్డుపడుతున్నా పట్టించుకోరు. కేబినెట్‍ని విప్పదీసి చూస్తే లోపలంతా రకరకాల కేబుళ్ళతో, ఏ కేబుల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలియక గందరగోళంగా ఉంటుంది. దీనివల్ల "మీ సిస్టమ్‍కి ఎంతో హాని జరుగుతుంది. కాబట్టి కేబినెట్ లోపల ఉండే కేబుళ్ళని ఒక క్రమ పద్ధతిలో అమర్చుకొని అవి మదర్‍బోర్డ్ పై ఉండే ఏ హార్డ్ వేర్ పరికరాలకు తగలని విధంగా విధంగా రబ్బర్‍బాండ్‍తో కట్టడం మంచిది. ఇకపోతే… కేబినెట్‍ని విప్పదీయగలిగాం కదా అని, మోనిటర్ కేస్‍ని విప్పదీయడానికి ప్రయత్నించకండి. టెక్నీషియన్ సాయం తిసుకోవడం మినహా మోనిటర్ల విశయంలో మీరు చెయ్యగలిగిందేమీ లేదు. అయితే మోనిటర్ లోపల ఎక్కువగా దుమ్ము పేరుకుపోకుండా ఉండడం కొసం పనంతా పూర్తయిన తర్వాత శుభ్రమైన కవర్‍తో దాన్ని కప్పి ఉంచండి.


కీబోర్డ్ ద్వారా ఎంతో చెత్త లోపలికి…..



కీబోర్డ్ విషయంలో కూడా ఇదే మాదిరి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలామంది యూజర్లు కీబోర్డ్ గురించి ఏ మాత్రం పట్టించుకోరు. కాఫీ, టీ, కూల్‍డ్రింక్స్ వంటి ద్రవపదార్ధాలను, ఇతర ఆహార పదార్ధాలను ఇష్టానుసారం కంప్యూటర్ వద్దే సేవిస్తుంటారు. ఇలా చేసేటప్పుడు ఆయా పదార్ధాలు పొరబాటున కీబోర్డ్ లో కీల మధ్య ఖాళీ స్థలాల్లోకి చొచ్చుకుపోతాయి మున్ముందు కొన్ని కీల కాంటాక్ట్ పాయింట్ల్లు దెబ్బ తిని వాటిని మనం ఎంత ప్రెస్ చేసినా పనిచెయ్యక ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి సాధ్యమైనంతవరకూ కంప్యూటర్ సమీపంలో ఆహారపదార్థాలను సెవించకండి. తరచుగా
కీబోర్డ్ ని బోర్లించి మెల్లగా దాని వెనుక చెత్తో కొట్టడం ద్వారా కీల మధ్య ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి ప్రయత్నించండి. ఎప్పుడు చేతులు కీబోర్డ్ పై అలాగే ఉంచడం వల్ల మన చెతులకు అంటుకున్న మురికి మొత్తం కీబోర్డ్ ని అందవిహీనంగా చేస్తుంది.కాబట్టీ దాన్ని అప్పుడప్పుడు నీట్‍గా క్లీన్ చేయడం అలవాటు చేసుకోండి.


ఇతరత్రా తీసుకోవలసిన జాగ్రత్తలు…


ఇకపోతే … ప్లాపీ డ్రైవ్, సిడిరామ్ డ్రైవ్ వంటి వాటిని తొలగించవలసి వచ్చినప్పుడు వెంటనే ఆ ఖాళీస్థలాన్ని కవర్ చేసేయండి. డ్రైవ్‍ల వద్ద ఖాళీస్థలం ఉండడం మూలంగా పెద్ద మొత్తంలో దుమ్ము, చీమలు, బొద్దింకలు. వంటి కీటకాలు కూడా క్యాబినెట్ లోపలికి ప్రవేశించి హాని కలిగించవచ్చు. అలాగే మౌస్ లోపల ఉండే ball కి, రోలర్లకీ దుమ్ము పట్టడం వల్ల ఎంత జరిపినా మౌస్ పాయింటర్ జరగకుండా మొరాయిస్తుంటుంది. అలాంటప్పుడు మౌస్ కవర్‍ని తొలగించి, మౌస్‍బాల్‍ని శుభ్రంగా కడిగి, పొడిగుడ్డతో తుడిచి, లోపల ఉండే రోలర్లపై పేరుకుపోయిన మురికిని మెత్తని గుడ్డతో మెల్లగా తొలగించాలి. దాంటో మౌస్ మళ్ళీ ఊపందుకుంఉంది. విద్యుత్ సరఫారాలో చోటు చేసుకునే భారీ హెచ్చుతగ్గులు, కంప్యూటర్‍ని అమర్చిన ప్లగ్ పాయింట్ సరిగ్గాఎర్త్ చెయ్యబడి లేకపోవడం, ప్లగ్ పాయింట్ నుండీ కంప్యూటర్‍కి విద్యుత్ సరఫరా చేసే పవర్ కార్డ్ దెబ్బతినడం వంటి పలు కారణాల వల్ల సిస్టమ్ లోపల ఉండే విలువైన హార్డ్ వేర్ పరికరాలు కాలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి, విద్యుత్ సరఫరా విషయంలొ కూడా ఎంతో జాగ్రత్త వహించాలి. ఒకే ప్లగ్ పాయింట్‍కి ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలను కనెక్ట్ చెయ్యడం మానేయాలి. ఇప్పటివరకు మనం చెప్పుకున్న జాగ్రత్తలు పాటిస్తే కంప్యూటర్‍ని అనేక ప్రమాదాలనుండి రక్షించవచ్చు

No comments:

Post a Comment