మనసులో..
అనుక్షణం దోబూచులాడే భావ తరంగాల సమాహారం..!!
Oct 8, 2012 - భావ సంఘర్షణ 1 Comment
సమాజం బాగుపడాలని ఆరాటపడే వాళ్ల కోసం..
అందరూ కూర్చుని హాపీగా పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటుంటే ఓ తండ్రో, కొడుకో, కూతురో సీరియస్‌గా ఓ రూమ్‌లో తలుపేసుకుని కూర్చుని ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా పనిచేసుకుంటూ పోతున్నారు.
బయట ఉన్న వ్యక్తులు మధ్యలో ఈ మిస్సింగ్ వ్యక్తి గుర్తొచ్చినప్పుడు "ఆ మాత్రం కష్టపడి ఉంటే మనం ఎప్పుడో బాగుపడే వాళ్లం.. అయినా మనలా సుఖపడడానికి అందరికీ ప్రాప్తం ఉండొద్దూ" అని ఓ నవ్వు నవ్వేసి కబుర్లలో పడ్డారు.
అదో ఆఫీస్..
అందరూ ఓచోట చేరి కబుర్లు చెప్పుకుంటుంటే ఒకళ్లిద్దరు తలెత్తకుండా పనిలో మునిగిపోయారు. అక్కడా అదే మాదిరి నవ్వులే.. అంత కష్టపడకపోతే ఏం పోయిందని!
కష్టపడకపోయినా హాపీగా బ్రతికేయగలుగుతున్నాం ఈ భూప్రపంచంలో మనుషులున్నంత వరకూ మన లౌక్యాలు బ్రహ్మాంఢంగా నడుస్తాయి. ఎవర్నైనా బుట్టలో పడేయగలం.. చకచకా నిచ్చెన మెట్లు ఎక్కేయగలం. కష్టపడే వాడిని పై మెట్టు నుండి క్రిందికి తొంగి చూసి వెక్కిరించేయగలం.
కష్టపడేవాడికి కాసేపు మనస్సు నొచ్చుకుంటుంది.. పక్కోడిలా బ్రతకడం చేతకావట్లేదా అన్న ఇన్‌సెక్యూరిటీ కూడా కాసేపు మనస్సు నిలవనీయదు. అంతలోనే ఆలోచనలు సద్దుమణుగుతాయి. ఎవరెలా పోయినా తనకి సంబంధం లేదన్నట్లు గుడ్డిగా మునుపటిలా తలొంచుకుని పనిచేయడం మొదలెడతాడు.
ఇక్కడ వ్యక్తిగా ఎదగడమే పారామీటర్ అనుకుంటే… లౌక్యంతో కబుర్లు చెప్పి, జనాల్ని మభ్యపుచ్చి కష్టపడకుండానే అవకాశాలు పొందే వాడు ఎప్పుడూ పై స్థాయిలోనే ఉంటాడు.
వ్యవస్థలో భాగంగా బాధ్యతగా ఉండడమే పారామీటర్ అనుకుంటే.. భజన కబుర్లు చెప్పి పబ్బం గడుపుకునే వాడు కష్టపడే వాడి కాలి గోటికి కూడా పనికిరాడు.
ఇప్పుడు అస్సలు పాయింట్‌కి వస్తాను..
మనలో చాలామందిమి సమాజం గురించీ, వ్యవస్థ గురించీ వల్లమాలిన అభిమానం కురిపిస్తుంటాం. ఆ అభిమానంలో ఒక్క శాతమైనా మన బాధ్యతల్ని చిత్తశుద్ధిగా నెరవేర్చడంలో కనబరుస్తున్నామా?
మనకు కష్టపడడం కన్నా లౌక్యంగా కబుర్లు చెప్పి ఎదిగే టెక్నిక్‌లే తెలుసు.
కానీ సొసైటీ బాగుండాలి… మనుషులు బాధ్యతగా ఉండాలి? ఈ ద్వందనీతి సమర్థనీయమా?
ఫలితంతో సంబంధం లేకుండా వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ చేతనైన పని చేసుకెళ్లే జనాలు ఎంతమంది ఈ సమాజంలో మిగిలున్నారు?
అందరూ ఎస్కేపిస్టులైతే.. ఒకరి మీద ఒకరు రాళ్లు వేసుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికొస్తారు?
టెక్నికల్ వీడియోలు ఎవరో ఒకరికి పనికొస్తాయని నాకు చేతనైన పని నేను సంతోషంగా చేస్తుంటే.. ఎంత మంది ఆత్మీయులు అడుగుతారో… "ఈ పని చేయడం ద్వారా మీకు లాభమేమిటండీ?" అని! ఏం సమాధానం చెప్పాలి.. నవ్వి ఊరుకోవడం తప్ప.
లాభాలూ, ఏదో రకమైన ప్రయోజనాలూ లేనిదే ఏ పనీ చేయడానికి ఒళ్లొంగని ఈ దేహంలో ఉత్సాహం ఉరకలెత్తాలంటే ఏం ఎత్తుతుంది.. కమ్ముకున్న బద్ధకాన్ని విదుల్చుకుని!!
అందరూ అనుకునేటట్లు కష్టపడడం బలహీనత కాదు, చేతకానితనమూ కాదు. అది మన బాధ్యత, మనకు తెలీని సంతోషం కలిగించే జీవన విధానం. మనుషుల్లో చిన్న వయస్సుల్లోనే ప్రేతకళలు ఆవరిస్తున్నాయంటే.. కష్టపడడం తెలీకపోవడం వల్ల కాదూ!
చివరిగా ఒక్కమాట.. కష్టాన్ని పాజిటివ్ కోణంలో తీసుకుంటే.. బద్ధకంగా బ్రతకడం ఎంత దారుణమైన స్థితో అర్థమవుతుంది. ఆలోచించి చూడండి.
No comments:
Post a Comment