Thursday, 11 October 2012

పై పై బతుకు…

పై పై బతుకు…


Rate This

 పై పై బతుకు…



ఇప్పుడంతా
పై పై బతికేయ్యటం అలవాటు చేసేసుకున్నాం
ఏ క్షణానన్నా పొరపాటున అంతరాలలోకి జారిపడితే
ఆత్మవిమర్శలు చుట్టుముడితే
అస్తిత్వం ప్రశ్నిస్తే
మిగిలేదంతా అంధకారమే!



ఇప్పుడంతా
పై పై బతుకులకు సౌఖర్యాల మేకప్పులే
మస్కారా కరిగితే, ఐలైనర్ చెదిరితే
కాంతి క్షిణించిన కళ్ళలో జీవాన్ని భూతద్దంలో వెతుక్కోవాల్సిందే!
లిప్ గ్లాస్ అద్దిన నవ్వులు లిప్ స్టిక్ చెదరనంత వరకే!
ఆ సింగారం కరిగి వికారం బయటపడే దాకా అంతా సౌందర్యమే!



ఇప్పుడంతా
పై పై బతుకున పైపై పొరలలో అల్లుకున్న బంధాలే
లోతుల్లోకి తొంగి చూసే తిరికేది ఎవరికైనా ?
పలకరింపు సమాధానాలన్నీ కుశలాలే!
ఆత్మను తాకే స్పర్శ
మనసును హత్తుకునే కౌగిలి
కష్టం పంచుకునే హృదయం మృగ్యమే!



ఇప్పుడంతా
పై పై బతుకు నడకల్లో భూమిని తాకని పాదాలే
గాలిని మించిన వేగంతో
భావనాలెక్కి, అంతస్తులు పెంచి
రోధసిలో తిరిగి తిరిగి అలిసాక
వాకిలిలో చేరి రోదిస్తూ విశ్రమించటమే!



ఇప్పుడంతా
పై పై బతుకు చేతల్లో మీటలు నొక్కే యాంత్రికతే
తినే తిండి, పిల్చే గాలీ లెక్కే
జీతాన్ని, జీవితాన్ని కంప్యూటర్ పెట్టెలో లాక్ చేసేసి
జీవాన్ని, ప్రాణాన్ని క్లికుల్లో లెక్కించేస్తున్నాం !
స్నేహం, బంధం, బంధుత్వాలన్ని కొనలకు వేలాడుతున్న ఆర్ధికతత్వాలే!

ఇప్పుడూ కూడా అప్పుడప్పుడూ
గుండెలోకి జారే అశ్రువు గర్భంలోకి చేరి
ఇలా..రహస్యాలను విప్పుతూనే ఉంటుంది!
అయినా…ఈ అశ్రువు జీవితకాలమెంతని?
ఎగిసే నిప్పుల సెగలో అవిరయ్యేంత వరకే కదూ?

No comments:

Post a Comment